Monday, October 7, 2024
HomeUncategorizedశంకరన్‌, శ్రీధరన్‌లా క‌లెక్ట‌ర్లు ప‌నితీరు ఉండాలి

శంకరన్‌, శ్రీధరన్‌లా క‌లెక్ట‌ర్లు ప‌నితీరు ఉండాలి

Date:

తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమై ప్రజలకు సరైన సేవలు అందించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లేదనని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్ర‌భుత్వానికి కళ్లు, చెవులు కలెక్టర్లేనని సీఎం వ్యాఖ్యానించారు. జిల్లా స్థాయిలో అధికారుల నిర్ణయాలు ప్రజలకు ప్రయోజనం కలిగేలా, మానవీయ కోణంలో ఉండాలని చెప్పారు. ఒక‌ శంకరన్‌, శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలన్నారు.

పారదర్శక ప్రజాహిత పాలన అందించాలని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలలో తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని.. విద్యార్థిపై నెలకు రూ.85వేలు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పర్యవేక్షణపై కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందిస్తున్నారని… కలెక్టర్లు బదిలీ అయినప్పుడు కూడా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితీరు చూపాలని సీఎం అన్నారు.

ధరణి సమస్యలు ఆగస్టు 15లోగా పరిష్కరించాలి

ధరణి సమస్యలపై పెండింగ్‌ దరఖాస్తులు ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో ధరణి సమస్యలపై సీఎం ఆరా తీశారు. దరఖాస్తులను తిరస్కరిస్తే వాటికి కారణాలు కూడా తెలపాలన్నారు. ధరణిలో పలు సాంకేతిక సమస్యల పరిష్కారానికి కొత్త ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చే అంశం పరిశీలించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు జియో ట్యాగింగ్‌ విధానాన్ని పరిశీలించాలని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.