Sunday, October 6, 2024
HomeUncategorizedవ్య‌క్తిగ‌త జీవితాల్లోకి మీడియా వెళ్లొద్దు

వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి మీడియా వెళ్లొద్దు

Date:

తెలంగాణ రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఈ కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో జడ్జీలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్​ నంబర్​ ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది.

ఫోన్​ ట్యాపింగ్‌​పై మీడియా సంయమనం పాటించాలని, బాధ్యతతో వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, ఫోన్​ ట్యాపింగ్​ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్​ దాఖలు చేశారని పేర్కొంది. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు తెలిపింది. వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.

జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్​ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జులై 23న కౌంటర్​ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును హైకోర్టు సీజే బెంచ్ విచారిస్తోంది. కాగా, పలు రాజకీయ నేతలతో పాటు జడ్జీల ఫోన్లు ట్యాప్​ చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్​ ట్యాపింగ్​ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం కౌంటర్​ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్‌​లో ప్రభుత్వం తెలిపింది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్​ చేసినట్లు కౌంటర్​ అఫిడవిట్​లో పేర్కొంది. ఇందుకు సంబంధించి హైకోర్టు బుధవారం విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని స్పష్టం చేసింది.