Saturday, September 28, 2024
HomeUncategorizedవేసవిలో రోగనిరోధక శక్తిని పెంచే జ్యూస్‌లు

వేసవిలో రోగనిరోధక శక్తిని పెంచే జ్యూస్‌లు

Date:

ఎండలు మండిపోతున్నాయి. వేసవిలో వేడి తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు, కొబ్బరి బోండాలు, చెరకు రసం వంటివి తాగుతారు. అయితే కృత్రిమ చక్కెరలతో తయారు చేసే కూల్‌డ్రింక్స్ కంటే సహజంగా లభించే పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే పోషకాలను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా ఏడు రకాల జ్యూస్‌లు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతూ, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందించగలవు.

*మిక్స్‌డ్ జ్యూస్

గ్రీన్ యాపిల్స్, క్యారెట్లు, నారింజ పండ్లు కలిపి చేసే మిక్స్‌డ్ జ్యూస్.. మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్‌. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చే సి, ఏ విటమిన్లు దీంట్లో ఉంటాయి. క్యారెట్ నుంచి లభించే విటమిన్ బి6 రోగనిరోధక కణాల విస్తరణ, యాంటీబాడీస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

*దుంపలతో జ్యూస్

క్యారెట్‌, బీట్‌రూట్, అల్లం వంటి రూట్ వెజిటేబుల్స్‌తో జ్యూస్ చేసుకొని తాగితే, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడే పోషకాలను శరీరానికి అందిస్తాయి. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో శరీర కణాల్లో వాపు ఏర్పడకుండా కాపాడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ల సమస్యలు ఉన్న వారు ఈ జ్యూస్ తాగితే వాపు, నొప్పి తగ్గుతాయి.

*సిట్రస్ జాతి పండ్ల రసాలు

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్. ఈ పోషకం శరీర కణాల వినాశనాన్ని అడ్డుకుంటుంది. విటమిన్ సి మంచి ఇమ్యూనిటీ బూస్టర్. అందుకే నిమ్మరసం, నారింజ, బత్తాయి, ద్రాక్ష పండ్లతో చేసిన జ్యూస్‌లను వేసవిలో తాగడం మంచిది. ఇవి జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తాయి.

*స్ట్రాబెర్రీ, మామిడి

వేసవిలో లభించే మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ, బాదంపాలు కలిపి స్మూతీ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇది మంచి రిఫ్రెష్, నూట్రియెంట్ డ్రింక్‌గా చెప్పుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే మామిడిపండ్లు, బాదం పాలలోని విటమిన్ ఇ రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది.

*టమాటా

టమాటాల్లో విటమిన్ బి9 (ఫోలేట్), మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు మద్దతుగా ఉంటూ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇంట్లో తాజా టమాట రసం తయారు చేసుకొని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.

*స్ట్రాబెర్రీ, కివి

స్ట్రాబెర్రీ, కివీ పండ్లతో చేసే జ్యూస్ తాగితే, వేసవిలో శరీరానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. ఈ పండ్లను స్కీమ్ మిల్క్‌తో కలిపి స్మూతీగా చేసి తీసుకుంటే ప్రొటీన్, విటమిన్ డి కూడా యాడ్ అవుతాయి. ఈ పోషకాలు శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించగలవు.

*కాలే, టమాటా, ముల్లంగి జ్యూస్

కాలే, టమాటాలు, ముల్లంగి కలిపి చేసే జ్యూస్‌లో విటమిన్ ఎ, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ డ్రింక్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో శరీరాన్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతూ, ఇమ్యూనిటీ పెంచుతుంది.