Sunday, October 6, 2024
HomeUncategorizedవిలాస బాబా... ఈ 'బోలే బాబా'

విలాస బాబా… ఈ ‘బోలే బాబా’

Date:

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆస్తులు, విలాసాలపై ఓ జాతీయ మీడియా ఛానెల్ విస్తుపోయే నిజాలు వెల్లడించింది. ఆయన ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు వెల్లడించింది.

భోలే బాబాకు దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు ఉన్నాయని సమాచారం. వీటిలో అత్యధికంగా యూపీలోనే ఉన్నాయి. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని ఆశ్రమంలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లే వీటి నిర్వహణ కార్యకలాపాలు చూస్తుంటారు. నిత్యం తెలుపు రంగు దుస్తులు, టై, కళ్లద్దాల్లో కనిపించే ఆయన అనుచరులకు దర్శనమిచ్చే సమయంలో భారీ పరేడ్‌తో వస్తారు. దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్‌లపై ప్రయాణిస్తూ దారిని క్లియర్‌ చేస్తారు. వెనక 15-30 కార్లతో ఆయన కాన్వాయ్‌ ఉంటుంది. దీంట్లో తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారులో ఆయన ప్రయాణిస్తారు. కారు సీట్లతో సహా ఇంటీరియర్‌ సైతం పూర్తిగా తెలుపు రంగులో ఉంటుందని ఆయన అనుచరుల్లో కొంతమంది తెలిపారు.

సూరజ్‌పాల్‌ మెయిన్‌పురిలోని ఆశ్రమంలో నివాసముంటారు. హరి నగర్‌గా పిలిచే ఈ ఆశ్రమం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. భోలే బాబా, ఆయన భార్య కోసం అందులో దాదాపు ఆరు విలాసవంతమైన గదులు ఉంటాయని సమాచారం. ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగానే దానికి విరాళాలిచ్చిన 200 మంది పేర్లు కనిపిస్తాయని తెలుస్తోంది. వాటిపై రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు ఇచ్చిన దాతల వివరాలు ఉంటాయని సమాచారం. ఇటావాలో మరో కొత్త ఆశ్రమం నిర్మాణంలో ఉంది.