ప్రయాణికులు సాధారణంగా బస్సులు, రైళ్లు, ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఉక్కపోతకు గురవుతుంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పేపర్లు, అట్టముక్కలు, క్లాత్స్ వంటి వాటితో ఊపుకుంటుంటారు. అయితే, తాజాగా ఓ విమానంలో ఉక్కపోతకు ప్రయాణికులు అల్లాడిపోయారు. ఏసీ లేక తీవ్ర అవస్థలు పడ్డారు.
ఢిల్లీ నుంచి దర్బంగా వరకూ ప్రయాణించిన ఓ స్పైస్ జెట్ విమానం (SG 476)లో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. ప్రయాణికుల అవస్థలు చూసిన తోటివారు విమానంలోని పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది.