వినేశ్ ఫోగాట్ అనర్హత పిటిషన్ పై CAS మధ్యవర్తిగా వ్యహరిస్తున్న ఆస్ట్రేలియా డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈమె ఇచ్చే తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెలువరించనుంది. ఒకవేళ, బెన్నెట్ భారత గ్రాప్లర్కు అనుకూలంగా తీర్పు ఇస్తే, IOC ఆమెకు రజతం ప్రదానం చేయనుంది.
అన్నాబెల్లె బెన్నెట్..?
డాక్టర్ అన్నాబెల్లె క్లైర్ బెన్నెట్.. ఆస్ట్రేలియా పౌరురాలు. ఈమె 1950, జనవరి 8న ఇమాన్యుయేల్ డారిన్, రైస్సా డారిన్ దంపతులకు జన్మించింది. బెన్నెట్ తండ్రి న్యాయవాది. తండ్రి మార్గాన్నే ఆమె ఎంచుకుంది. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీలో సైన్స్ అభ్యసించిన బెన్నెట్, బయోకెమిస్ట్రీలో Ph.D చేసింది. అనంతరం న్యాయవాద వృత్తిపై ఆసక్తితో న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించింది.
బెన్నెట్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా మాజీ న్యాయమూర్తి. AC SC FAA FAL బాండ్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్. ఇప్పుడు ఈమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ సలహాదారుగా, సీనియర్ న్యాయవాదిగా, మధ్యవర్తిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. డాక్టర్ బెన్నెట్ గతంలో నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ చైర్‌గా ఆస్ట్రేలియా ప్రభుత్వ వైద్య పరిశోధన నిధుల సంస్థకు నాయకత్వం వహించారు. ఆమె ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ కౌన్సిల్ సభ్యురాలు కూడానూ. ప్రో-ఛాన్సలర్‌గా క్వెస్టాకాన్ కోసం సలహా మండలిలో ఒక దశాబ్దం పాటు పనిచేసింది. ఈమె మేధో సంపత్తిని మెచ్చి ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి.
తుది నిర్ణయం ఎప్పుడు..?
ఆగష్టు 11 ఒలింపిక్స్ టోర్నీకి చివరి రోజు. అంటే, రాబోవు 48 గంటల్లో ఏ క్షణమైనా తీర్పు వెలువడవచ్చు. ఇప్పటికే వినేశ్ ఫోగాట్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాదనలు విన్న ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై తలమునకలై ఉన్నారు.