Sunday, October 6, 2024
HomeUncategorizedవర్షం కారణంగా 50పైగా విమానాలను రద్దు

వర్షం కారణంగా 50పైగా విమానాలను రద్దు

Date:

ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఈ భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తున్నది. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు పలుచోట్ల 300 మిల్లీమీటర్లకు పైగా వర్షం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదర్‌ అతలాకుతలమైంది. ఇక్కడ రోడ్లపై నుంచి రైలు పట్టాల వరకు నీరు నిండిపోయింది. కార్లు రోడ్లపై నీటిలో తేలియాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సెలవు ప్రకటించింది.

భారీ వర్షాలతో వెళుతురు లేని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్యాహ్నం 2.22 నుంచి 3.40 గంటల వరకు రన్‌వే కార్యకలాపాలను నిలిపివేసింది. దాంతో 50పైగా విమానాలను రద్దు చేయడంతో పాటు ఆయా విమానాలను అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ఇండోర్‌కు మళ్లించారు. ఇదిలా ఉండగా.. వరద పరిస్థితిని సమీక్షించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే డిజాస్టర్ కంట్రోల్ రూమ్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ముంబయి గార్డియన్ మంత్రి ఎంపీ లోధా, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ మంత్రి అనిల్ పాటిల్ సైతం హాజరయ్యారు. సమావేశంలో సీఎం షిండే మాట్లాడుతూ నిన్న రాత్రి నుంచి ముంబయిలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. వర్షం నీటిని తోడేందుకు 200 నీటి పంపులు, 400 బీఎంసీ పంపులు పని చేశాయని.. సెంట్రల్‌, హార్బర్‌ లైన్లలో రైళ్లు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు.