Wednesday, January 15, 2025
HomeUncategorizedవర్షంలో మీ కార్లు తడుస్తున్నాయా.. ఐతే జాగ్ర‌త్త‌

వర్షంలో మీ కార్లు తడుస్తున్నాయా.. ఐతే జాగ్ర‌త్త‌

Date:

దేశ‌వ్యాప్తంగా విప‌రీతంగా ఎడ‌తెరిపి లేని వ‌ర్షాలు మొద‌ల‌య్యాయి. చాలా ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు ఏరులై పారుతున్నాయి. ముఖ్యంగా కారు ఓనర్లు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, జలమయమైన రోడ్లలో ప్రయాణాలతో కారులోని 8 భాగాలు బాగా దెబ్బతింటాయి. వాటిని రిపేర్ చేయించుకోవడం ఆర్థిక భారంగా మారుతుంది. ఆన్‌లైన్ యూజ్డ్ కార్ మార్కెట్‌ప్లేస్ అయిన కార్స్24కు చెందిన ఒక ఎక్స్‌పర్ట్ వానా కాలంలో కారు పార్ట్స్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్ పంచుకున్నారు.

*టైర్లు*

ఈ కాలంలో టైర్ల రబ్బర్ దెబ్బతింటుంది. వరదలకు కూడా పాడైపోతాయి. ఫలితంగా టైర్ల గ్రిప్ తగ్గుతుంది. అందుకే టైర్లు మంచిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తూ ఉండాలి. అరిగిపోతే మార్చుకోవడం మంచిది. తక్కువ గాలి ఉన్న టైర్లు వర్షాకాలంలో మరింత ప్రమాదకరంగా ఉంటాయి, ఎందుకంటే అవి సులభంగా స్కిడ్ అవుతాయి. కాబట్టి ఎయిర్ ప్రెషర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

*వైపర్లు, విండ్‌షీల్డ్*

భారీ వర్షాలు, ధూళి, చెత్తతో కూడిన వర్షాకాలం వైపర్లు, విండ్‌షీల్డ్‌కు చాలా హాని చేస్తుంది. వైపర్లను ఎక్కువగా వాడటం వల్ల అవి త్వరగా అరిగిపోతాయి. దీనివల్ల చారలు ఏర్పడి విండ్‌షీల్డ్ ద్వారా స్పష్టంగా చూడలేం. విండ్‌షీల్డ్‌పై నీరు పడటం వల్ల పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని రక్షించుకోవడానికి వైపర్ బ్లేడ్స్‌ను మంచి కండిషన్‌లో ఉంచాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చాలి. క్వాలిటీ క్లీనర్లు, రెయిన్‌ రెపలెంట్స్ ఉపయోగించాలి. వాషర్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ నిండినట్లు చూసుకోవాలి. స్ప్రే నాజిల్లు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవాలి.

*పెయింట్‌*

వర్షాలు, బురద, కాలుష్యాలు వల్ల కారు పెయింట్ కలర్ పోతుంది. మరకలు ఏర్పడతాయి. ఎసిడిక్ రెయిన్స్‌ కారణంగా పెయింట్ త్వరగా వీక్ అయిపోతుంది. కారును తరచుగా కడగాలి. వ్యాక్స్ చేయాలి. ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ కోసం హై-క్వాలిటీ పెయింట్ సీలెంట్‌ను ఉపయోగించాలి.

*బ్రేక్స్‌*

వర్షాలు బ్రేక్ ప్యాడ్స్‌, డిస్క్స్‌పై మరింత తుప్పు పడతాయి. దీనివల్ల బ్రేక్‌ల పనితీరు తగ్గుతుంది. తడి రోడ్లు బ్రేక్ డైస్టెన్స్‌ను పెంచుతాయి, అప్పుడు డ్రైవింగ్ మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే వర్షాకాలం ముందు, తర్వాత, క్రమం తప్పకుండా బ్రేక్స్‌ను చెక్ చేసుకోవాలి. నీటిలో డ్రైవ్ చేసిన తర్వాత, బ్రేక్స్‌పై తట్టాలి, అప్పుడే తద్వారా అవి ఆరిపోతాయి. పెద్దగా నష్టం వాటిల్లదు.

*ఎలక్ట్రికల్ సిస్టమ్స్*

వానాకాలంలో కారు ఎలక్ట్రికల్ సిస్టమ్స్‌ దెబ్బతింటాయి, షార్ట్ సర్క్యూట్స్‌, లైట్లు, సెన్సార్లు, ఇతర సిస్టమ్స్‌లో సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలతో పాటు తుప్పుకు పరిష్కారంగా కనెక్టర్లపై డైఎలక్ట్రిక్ గ్రీజును ఉపయోగించాలి. అన్ని విద్యుత్ కనెక్షన్లు ఇన్సులేట్ అయ్యేలా, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. బ్యాటరీ టెర్మినల్స్, వైరింగ్, ఫ్యూజ్ బాక్స్ ఆక్సిడేషన్ వంటివి డైలీ చెక్ చేసుకోవాలి. వానకు తడవని చోట కారు పార్క్ చేయాలి.

*ఇంజన్‌*

ఈ కాలంలో నీరు ఇంజన్‌లోకి ప్రవేశించవచ్చు. సిలిండర్లలో వాటర్ నిండి పిస్టన్ కదలికకు అడ్డంకిగా మారవచ్చు. ఇది ఇంజన్‌కు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. లోతైన నీటిలో డ్రైవింగ్ చేస్తే మరింత నష్టం జరుగవచ్చు. అందుకే నీరు పొంగిపొర్లుతున్న ప్రాంతాల్లో డ్రైవ్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ తప్పదు అనుకుంటే స్లోగా డ్రైవ్ చేయడం మంచిది.

*కారు అడుగు భాగం*

కారు అడుగు భాగంలో ఎగ్జాస్ట్ సిస్టమ్, ఫ్యూయల్ లైన్లు, సస్పెన్షన్ వంటి భాగాలు ఉంటాయి. చెత్త, బురద కారణంగా ఇవి తుప్పు పట్టి బలహీనపడతాయి. అందుకే యాంటీ-రస్ట్ ట్రీట్‌మెంట్‌ను వాడాలి. క్రమం తప్పకుండా కారు అడుగు భాగాన్ని శుభ్రం చేయాలి.

*కారు బ్యాటరీ*

అధిక తేమకు బ్యాటరీలు త్వరగా డిశ్చార్జ్ అవుతాయి, టెర్మినల్స్‌కు తుప్పు పట్టవచ్చు. తుప్పు స్టార్టింగ్ సమస్యలు, బ్యాటరీ సామర్థ్యం తగ్గడానికి దారితీస్తుంది. నీరు బ్యాటరీ కేసింగ్‌ను కూడా దెబ్బతీస్తుంది. అందుకే బ్యాటరీ టెర్మినల్స్‌ను శుభ్రంగా, తుప్పు పట్టకుండా ఉంచాలి. వాటిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా సొల్యూషన్ ఉపయోగించాలి. పెట్రోలియం జెల్లీని కూడా వాడవచ్చు. బ్యాటరీ వోల్టేజ్, స్టేటస్ క్రమం తప్పకుండా చెక్‌ చేయాలి.