తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 30మంది చనిపోతే.. కేవలం 15 మందే చనిపోయారని చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతోందన్నారు. వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండి పడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆరోపించారు.
”వరద బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిత్యావసరాలు సహా దస్త్రాలు, పుస్తకాలు కూడా కొట్టుకుపోయాయి. ఇళ్లపై నిలబడిన వరద బాధితులకు ఆహారం కూడా అందించలేదు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. రాష్ట్రానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కేంద్రం ఎందుకు పంపలేదు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి. అందరం కలిసి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం, మహబూబాబాద్ ప్రజలు బలైపోయారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలి. నష్టపోయిన వారికి తక్షణమే రూ.2లక్షల పరిహారం ఇవ్వాలి. వర్షం తగ్గి రెండ్రోజులు అయినా.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. మంచినీరు, ఆహారం కూడా సరఫరా చేయలేదు. వరద బాధితులకు 5 కిలోల బియ్యం ఇస్తే ఎలా వండుకుంటారు?”అని హరీశ్‌రావు ప్రశ్నించారు.