Monday, November 18, 2024
HomeUncategorizedవడగాలులకు 9రోజుల్లో 192మంది మృతి

వడగాలులకు 9రోజుల్లో 192మంది మృతి

Date:

దేశరాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు నీటి సంక్షోభంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదు. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిపోతున్నాయి.

ఇక ఉండేందుకు ఇల్లు లేక ఫుట్‌పాత్‌లపైనే కాలం వెళ్లదీసే నిరాశ్రయుల పరిస్థితి గురించైతే చెప్పాల్సిన అవసరం లేదు. జూన్‌ 11 నుంచి జూన్‌ 19వ తేదీ వరకూ తొమ్మిది రోజుల వ్యవధిలో ఏకంగా 192 మంది నిరాశ్రయులు ప్రాణాలు కోల్పోయారు. వడదెబ్బ కారణంగానే వీరంతా మరణించారని ఎన్జీవో సెంటర్‌ ఫర్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ పేర్కొంది. NGO ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అలెడియా మాట్లాడుతూ.. ‘జూన్ 11 నుంచి 19వ తేదీ వరకూ తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా ఢిల్లీలో 192 మంది నిరాశ్రయుల మరణించారు’ అని తెలిపారు. గత ఐదేళ్లలో నమోదైన అత్యధిక మరణాలు ఇవే అని ఎన్జీవో తెలిపింది. 2019 జూన్‌ 11 నుంచి 19 వరకూ 143 మంది, 2020లో జూన్‌ 11 నుంచి 19 వరకూ 124 మంది, 2021లో జూన్‌ 11 నుంచి 19 వరకూ 58 మంది, 2022లో జూన్‌ 11 నుంచి 19 వరకూ 150 మంది, 2023 జూన్‌ 11 నుంచి 19 వరకూ 75 మంది నిరాశ్రయులు వడదెబ్బ కారణంగా మరణించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మాత్రం ఏకంగా 192 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది.