కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అందించే ఆహారంపై గత కొన్ని రోజులుగా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సాధారణ రైళ్లలో కంటే వందేభారత్‌లో ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఫుడ్ మాత్రం సరిగా ఉండటం లేదని.. పాచిపోయిన, పురుగులు పడిన ఆహారం వచ్చిందంటూ ప్రయాణికుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. తాజాగా ఓ జంటకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వందే భారత్‌లో అందించిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది.
భోపాల్ నుంచి ఆగ్రాకు వందేభారత్ రైలులో ప్రయాణించిన దంపతులకు ఈ అనుభవం ఎదురైంది. వారు ఆర్డర్ చేసిన ఫుడ్‌లో బొద్దింక కనిపించింది. దీంతో ఈ విషయాన్ని విదిత్ వర్ష్నే అనే నెటిజన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ‘ఈనెల 18వ తేదీన మా ఆంటీ, అంకుల్ వందేభారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకూ ప్రయాణించారు. ఆ సమయంలో ఐఆర్‌సీటీసీ పెట్టిన భోజనంలో బొద్దింక వచ్చింది’ అని పోస్టు పెట్టారు. అంతేకాకుండా ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి అంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనపై ఐఆర్‌సీటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ‘మీకు కలిగిన అనుభవానికి క్షమాపణలు కోరుతున్నాము. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాం. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించాం’ అని తెలిపింది.