Thursday, October 3, 2024
HomeUncategorizedవందేభారత్‌లో టికెట్ లేని ప్రయాణికులు

వందేభారత్‌లో టికెట్ లేని ప్రయాణికులు

Date:

రైలు ప్రయాణికులు కొంతమంది టికెట్‌ కొనుగోలు చేయకుండా ప్రయాణిస్తూ టీసీకి దొరికిపోయిన సందర్భాలు చాలానే చూశాం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్‌ రైలులోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ రైలు.. టికెట్‌ కొనుగోలు చేయకుండా ప్రయాణిస్తున్న వారితో కిటకిటలాడింది. లఖ్‌నవూ నుంచి డెహ్రడూన్‌ మధ్య ప్రయాణించిన వందే భారత్‌ రైలులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ఓ వ్యక్తి ప్రీమియం రైలులో ఈ పరిస్థితి తలెత్తడంపై ఆందోళన వ్యక్తంచేశారు. నెటిజన్లు స్పందిస్తూ.. దేశంలో మరికొన్ని రైళ్లను నిర్మించడం లేదా బోగీలను పెంచే ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఉత్తర రైల్వేశాఖ స్పందించింది. ఇది పాత వీడియో అని స్పష్టంచేసింది. ”కొందరు రైతులు బలవంతంగా రైలులోకి ఎక్కినప్పుడు జరిగిన సంఘటన ఇది. పాత వీడియోను ప్రస్తుతం షేర్‌ చేశారు. దయచేసి ఇలాంటివి ప్రచారం చేయకండి. ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోండి” అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పేర్కొంది.