Sunday, September 22, 2024
HomeUncategorizedలోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

Date:

లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు ఉండదని, ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి సోమవారం తెలిపారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని బీఎస్పీ స్పష్టం చేసినప్పటికీ దీనిపై వదంతులు వ్యాపిస్తుండడంతో ”బీఎస్పీతో పొత్తు లేకుండా కొన్ని పార్టీలు ఇక్కడ రాణించలేవు. కాని పార్టీ ఒంటరిగానే ముందుకువెళ్తుంది. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం.” అని బీఎస్పీ చీఫ్‌ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

లఖ్‌నవూలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పొత్తులతో తమ పార్టీకి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండట్లేదన్నారు. దేశంలోని చాలా పార్టీలు తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయని, కాని తమకు ఆ ఆలోచన లేదన్నారు. ఎన్నికల అనంతరం పొత్తుపై ఆలోచిస్తామని తెలిపారు. “పేదలు, దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైన వారి సంక్షేమాన్ని దృష్టిలోఉంచుకుని, మా పార్టీ ప్రజాబలంతో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ప్రజలు వదంతులు నమ్మొద్దు.” అని ఆమె పేర్కొన్నారు. 2023, డిసెంబర్‌ 21న ఇండియా బ్లాక్‌లోని సభ్య పార్టీలు, ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరనివారిపై విమర్శలు చేయడంతో మాయావతి వారిపై విరుచుకుపడ్డారు. బీఎస్పీ సహా కూటమిలో భాగం కాని పార్టీలపై ఎవరైనా అనవసర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో ఎవరికి ఎవరి అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ఇటువంటి విమర్శలకు పాల్పడొద్దని ఘాటుగా విమర్శించారు.