Sunday, September 22, 2024
HomeUncategorizedలక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు

లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు

Date:

కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచేందుకే మేడి గడ్డలో పర్యటిస్తునట్లు ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎంతో పాటు ప్రజాప్రతినిధుల బృందం, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీకు సంబంధించి ఐదుగురు నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు.

కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పారని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని, నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ వివరించిందని సీఎం వివరించారు. 2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారన్న సీఎం, సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు అని అన్నారు. కాళేశ్వరం రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ.25 వేల కోట్లు అవసరమని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందని రేవంత్​ తెలిపారు. ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని తెలిపారు. వానాకాలం నీరు వస్తే, సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయని పేర్కొన్నారు.