మార్పు అనే పేరుతో అమాయకులైన యువతను కాంగ్రెస్ మోసం చేసిందని, ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లను ప్రభుత్వం గోసపెడుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడోవంతు సీట్లను ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా పనిచేయమని ప్రజలు బీఆర్ఎస్‌ను ఆదేశించారని కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటల కరెంటు రావడం లేదన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతీసి కొడతామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుభరోసా ఇచ్చామంటూ అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెబుతున్నారని ధ్వజమెత్తారు.
రైతులను చెప్పుతో కొడతామంటున్న కాంగ్రెస్ పార్టీని ఓటుతో కొడదామని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారని.. ఇప్పటికీ అది అమలుకాలేదన్నారు. రుణం తెచ్చుకున్న రైతులకు మొండిచేయి చూపించారని విమర్శించారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఫైలుపై సంతకం చేస్తామని రేవంత్ చెప్పారని గుర్తు చేశారు. తాము ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఎప్పటి నుంచి ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగం సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగం కంటే హీనంగా ఉందన్నారు. కాంగ్రెస్ 420 హామీలిచ్చిందని.. ఆ హామీలను అమలు చేయకుంటే బట్టలిప్పి నిలబెడతామన్నారు కేటీఆర్. నోటికొచ్చిన హామీలిచ్చి ఇరుక్కుపోయారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది వేచి చూద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్. పార్లమెంటు ఎన్నిల కోడ్ రాకముందే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి, తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ తెలిపారు.