Saturday, October 5, 2024
HomeUncategorizedరోడ్లపై చెత్తను, మట్టిని పట్టించుకోని అధికారులు

రోడ్లపై చెత్తను, మట్టిని పట్టించుకోని అధికారులు

Date:

రోడ్లపై చెత్త, చెదారం పేరుకుపోతే అధికారులే తమ సిబ్బందితో శుభ్రం చేపించాలి. కానీ రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, మట్టిని మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో టెక్కీలు, కాలేజీ స్టూడెంట్స్‌, స్కూల్‌ విద్యార్థులు రంగంలోకి దిగారు. చెత్త ఊడ్చి మట్టి ఎత్తి ఆ రోడ్డును శుభ్రం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కడుబీసనహళ్లి, వర్తూరు మధ్య రద్దీగా ఉండే బలగెరె రహదారిపై చెత్త, మట్టి పేరుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు, నడిచి వెళ్లేవారు జారి పడుతున్నారు. బెంగుళూరు పౌర సంస్థ బీబీఎంపీకి ఎన్నిస్లారు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నిధులు లేవంటూ అధికారులు నిర్లక్ష్యం వహించారు.

అధికారుల తీరుతో విసిగిపోయిన బెంగళూరు వాసులు రంగంలోకి దిగారు. టెక్కీలు, విద్యార్థులు కలిసి వచ్చారు. వారాంతంలో ఆ రహదారిపై చెత్త ఎత్తివేసి క్లీన్‌ చేశారు. పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఈ క్లీనింగ్ డ్రైవ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు స్పందించారు. రోడ్డును క్లీన్‌ చేసిన టెక్కీలు, స్టూడెంట్స్‌ను ప్రశంసించారు. బీబీఎంపీ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దీనిపై స్పందించారు. కొన్నిసార్లు కొన్ని పాఠాలు ఉత్తమ గుణపాఠాలు అవుతాయని అన్నారు. బెంగళూరు వాసులు బలగెరె రోడ్‌ను క్లీన్‌ చేసిన సంఘటనను బీబీఎంపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మరోసారి ఇలా జరుగకుండా చూడాలని వారిని ఆదేశించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.