Tuesday, September 24, 2024
HomeUncategorizedరోగిగా నటిస్తూ ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్

రోగిగా నటిస్తూ ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్

Date:

ప్రభుత్వ వైద్యులు రోగికి అందుబాటులో ఉండటం లేదని, రోగులతో ఆసుపత్రి సిబ్బంది పనితీరు బాగాలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐఏఎస్‌ అధికారిణి ప్రభుత్వ ఆసుపత్రిని రహస్యంగా తనిఖీ చేయాలని నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిరోజాబాద్‌లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు ఫిర్యాదులు అందాయి. ఉదయం పది గంటలు దాటినప్పటికీ డాక్టర్లు అందులోబాటులో ఉండటం లేదని ఆరోపణలు వచ్చాయి.

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని జిల్లా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్ నిర్ణయించింది. దీంతో తనను గుర్తించకుండా ముఖానికి ముసుగు వేసుకుంది. రోగి మాదిరిగా నటించి డాక్టర్‌ చెకప్‌కు వెళ్లింది. అయితే డాక్టర్‌ ప్రవర్తన సరిగా లేకపోవడాన్ని అధికారిణి కృతి గ్రహించింది. హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేయగా కొందరు గైర్హాజరైనట్లుగా గుర్తించింది. రిజిస్టర్‌లో కొందరి సంతకాలు ఉన్నా ఆ సిబ్బంది అక్కడ లేకపోవడం, సిబ్బంది సేవల తీరు సరిగా లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్‌ స్టోర్‌ను కూడా డిప్యూటీ కలెక్టర్‌ కృతి రాజ్‌ తనిఖీ చేసింది. స్టాక్‌లో సగానిపైగా గడువు ముగిసిన మందులు ఉన్నట్లు గుర్తించింది. అక్కడి అపరిశుభ్రత పట్ల కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితిపై నివేదిక పంపుతానని వెల్లడించింది. ఐఏఎస్‌ అధికారిణి కృతి ముఖానికి ముసుగు వేసుకుని, సాధారణ రోగి మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.