Tuesday, October 8, 2024
HomeUncategorizedరైతుల సమస్యలు తీర్చే చర్యలు చేపట్టాలి

రైతుల సమస్యలు తీర్చే చర్యలు చేపట్టాలి

Date:

రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శంభూ సరిహద్దు పరిస్థితులపై హరియాణా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘రైతుల సమస్యలను తీర్చేందుకు మీరు (కేంద్ర ప్రభుత్వం) కొన్ని చర్యలు చేపట్టాలి. లేదంటే వారు దిల్లీకి ఎందుకు రావాలనుకుంటారు? ఇక్కడి నుంచి మీరు మంత్రులను పంపిస్తున్నారు సరే.. కానీ, మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోంది. స్థానిక సమస్యలను విస్మరించి మీరు స్వప్రయోజనాల గురించి మాత్రమే చర్చిస్తున్నారని రైతులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే ఓ తటస్థ అంపైర్‌ కావాలి. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు పంపించట్లేదు?” అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.

రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది. ఈ కమిటీ సభ్యుల పేర్లను ఇవ్వాలని పంజాబ్‌, హరియాణా ప్రభుత్వాలకు సూచించింది. దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది.