Sunday, September 22, 2024
HomeUncategorizedరైతుల మేలుకోసమే మా ప్రభుత్వం

రైతుల మేలుకోసమే మా ప్రభుత్వం

Date:

రైతులకు మేలు చేసే పథకాలపై మా ప్రభుత్వం పని చేస్తోందని, గతంలో అన్నదాతలకు బ్యాంకులు రుణాలు ఇచ్చేవి కాదు. కానీ దానిపై మేం వారికి గ్యారంటీ ఇచ్చాం” అని ప్రధాని మోడీ తెలిపారు. రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం హరియాణాలో పర్యటించారు. రేవాడీలోని ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని కోరుతూ అన్నదాతలు చేపట్టిన ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. దీనిపై రైతు సంఘాలతో కేంద్రమంత్రులు గురువారం జరిపిన చర్చలు ఫలించలేదు. తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని, తప్పకుండా ఢిల్లీ చేరుతామని రైతన్నలు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా పంజాబ్‌, హరియాణా సరిహద్దుల్లోనే ఉన్నారు. అటు, దేశ రాజధాని సరిహద్దుల్లోనూ భారీగా బలగాలు మోహరించాయి.

రేవాడీ సభలో ప్రధాని కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. శ్రీరాముడంటే ఊహ, అయోధ్యలో ఆలయనిర్మాణం వద్దన్న వాళ్లే ఇప్పుడు ‘జై సీతారామ్‌’ అని నినదిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుకు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అడ్డంకులు సృష్టించిందని, కానీ తమ ప్రభుత్వం దానిపై గ్యారెంటీ ఇచ్చి నెరవేర్చిందని గుర్తుచేశారు. గత 10 ఏళ్లలో భారత్‌ ఎన్నో నూతన శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన దేశాన్ని అమితంగా గౌరవిస్తున్నారు. 11వ స్థానంలో ఉన్న మనం.. ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగాం. ఇదంతా మీ ఆశీర్వాదం వల్లే సాధ్యమైంది. మూడోసారి పాలనలో దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేసేందుకు మీ ఆశీస్సులు కావాలి” అని మోడీ ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.