Sunday, September 22, 2024
HomeUncategorizedరేష‌న్ పంపిణీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసమా..!

రేష‌న్ పంపిణీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసమా..!

Date:

కేర‌ళ‌లో రేష‌న్ వ్య‌వ‌స్ధ దీర్ఘ‌కాలంగా ఉంద‌ని, గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మోడీ ప్ర‌భుత్వం నూత‌న ప్ర‌చార పోక‌డ‌ను చేప‌ట్ట‌డం అభ్యంత‌ర‌క‌ర‌మ‌ని సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆరోపించారు. కేర‌ళ‌లోని రేష‌న్ షాపుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు స‌రైన‌వి కాద‌ని, వీటి అమ‌లు క‌ష్ట‌మ‌ని చెప్పారు.

జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద ప‌నిచేస్తున్న‌ రేష‌న్ పంపిణీ వ్య‌వ‌స్ధ‌ను ఎన్నిక‌ల ప్ర‌చారానికి వాడుకోవ‌డం స‌రైంది కాద‌ని విజ‌య‌న్ కేర‌ళ అసెంబ్లీ వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వ తీరును దుయ్య‌బ‌ట్టారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు ప్ర‌చారం కోస‌మే మోదీ ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నేది సుస్ప‌ష్ట‌మ‌ని అన్నారు. ఈ త‌ర‌హా ప్ర‌చారం స‌రైంది కాద‌ని త‌న ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి నివేదిస్తుంద‌ని, ఇలా చేయ‌డం క‌ష్ట‌మ‌ని కూడా వివ‌రిస్తామ‌ని తెలిపారు.

రేష‌న్ షాపుల్లో ప్ర‌ధాని మోడీ పోస్ట‌ర్లు, బ్యాన‌ర్లు ఏ్పాటు చేయాల‌ని, ఆహారోత్ప‌త్తులతో కూడిన క్యారీ బ్యాగ్‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం లోగోల‌ను ముద్రించాల‌ని కూడా ఎఫ్‌సీఐతో పాటు కేర‌ళ ఆహార శాఖ‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింద‌ని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ పేర్కొన్నారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేష‌న్ షాపుల్లో ప్ర‌ధానమంత్రి సెల్ఫీ పాయింట్ల‌ను నెల‌కొల్పాల‌ని కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని మంత్రి వెల్ల‌డించారు.