తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 45 రోజులైనా రేవంత్ రెడ్డి సాధించింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుంచి సాగుతుందన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా ప్రారంభించినట్టు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని కేటీఆర్ ఆరోపించారు. ఇలా అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ 420 హామీలని కేటీఆర్ మండిపడ్డారు. గుంపు మేస్త్రి పాలనలో ప్రజలు పథకాల కోసం క్యూ కడుతున్నారని, ఆర్టిసి బస్సులలో మహిళలు సిగపట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
హామీలు ఇచ్చే ముందు ఆలోచించకపోతే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బట్టలు విప్పి నిలబెడతామని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఇంకా కెసిఆర్ పై విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారన్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామని బాధ పడుతున్నారన్నారు.
సీఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై అసత్యాలు చెప్పారని, రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే నని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని, కానీ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం వల్లే తాము ప్రజల బాగు కోసం స్పందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంప్ ఆఫీస్, కొత్త హైకోర్టు ఎలా కడుతున్నారని ప్రశ్నించారు. సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంప్ ఆఫీసులు వస్తాయా అంటూ ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతుందన్నారు.