Thursday, October 3, 2024
HomeUncategorizedరెండు చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం

రెండు చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం

Date:

లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో.. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీతో రాహుల్ విజయం సాధించారు. ఉత్తర​ప్రదేశ్‌లోని తమ కంచుకోట రాయబరేలీలో 3.7లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో రాహుల్ గాంధీ గెలిచారు. 2019 ఎన్నికల్లో సోనియా గాంధీకి వచ్చిన మెజార్టీని రాహుల్ గాంధీ దాటేశారు. గత ఎన్నికల్లో ఆమెకు రాయబరేలీలో 1.67 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చింది. రాయబరేలి నియోజకవర్గానికి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల దూరంగా ఉంటున్నట్టు ప్రకటిస్తూ ఆమె రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. రెండు స్థానాల్లో విజయం సాధించిన రాహుల్ ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ అక్కడ భారీ సంఖ్యలో సీట్లను గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ, ఈసారి బీజేపీకి యూపీలో ఎదురుగాలి వీచింది. అక్కడ ఇండియా కూటమి అనూహ్యంగా పైచేయి సాధించింది. గత ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి యూపీలో 65 స్థానాల్లో విజయం సాధించిన కమలదళం.ఈసారి మాత్రం గతం కంటే సగం సీట్లను కోల్పోయింది. అఖిలేశ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసి మంచి ఫలితాలను అందుకున్నాయి. గత ఎన్నికల్లో కోల్పోయిన కంచుకోట అమేథీని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. అమేథీలో గత ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేసి గెలిచిన స్మృతీ ఇరానీ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.