Saturday, October 5, 2024
HomeUncategorizedరూ. 12 కోట్ల వంతెన సెకన్లలో కూలిపోయింది

రూ. 12 కోట్ల వంతెన సెకన్లలో కూలిపోయింది

Date:

బీహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో తాజాగా మరో వంతెన కూలిపోయింది. వారంలో ఇది నాలుగవ వంతెన. కంకై నదిపై ఉన్న ఉపనదిపై 70 మీటర్ల వంతెన కూలిపోయింది. ఇది బహదుర్‌గంజ్ మరియు దిఘల్‌బ్యాంక్ బ్లాక్‌లను కలుపుతుంది. ఇది కూలిపోవడంతో రెండు పట్టణాల మధ్య కనెక్టివిటీ దెబ్బతింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న బహదుర్‌గంజ్ పోలీస్ స్టేషన్ చీఫ్ అభినవ్ పరాసర్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే ఇరువైపులా బారికేడ్ చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దాదాపు ఆరేళ్ల క్రితం ఈ వంతెనను నిర్మించినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు శాఖ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా మేజిస్ట్రేట్ తుషార్ సింగ్లా మాట్లాడుతూ.. కంకై నదిని మహానంద నదికి కలిపే చిన్న ఉపనదిపై 2011లో వంతెనను నిర్మించారని తెలిపారు. నేపాల్‌లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిందన్నారు. భారీ ప్రవాహానికి వంతెన స్తంభాలలో ఒకటి తట్టుకోలేకపోయిందని పేర్కొన్నారు. గత వారం సివాన్, అరారియా జిల్లాల్లో మూడు వంతెనలు కూలిన సంఘటనలు అందరికీ తెలిసిందే. జూన్ 19న బీహార్‌లోని అరారియా జిల్లాలో బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ప్రారంభానికి ముందే కూలిపోయింది. రూ. 12 కోట్లతో నిర్మించిన వంతెన సెకన్లలో కూలిపోయింది. స్పాట్ నుంచి వీడియోలు వైరల్ అయ్యాయి. భారీ కాంక్రీటు భాగాలు కొట్టుకుపోతున్నట్లు కనబడ్డాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో ప్రజాపనుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.