Monday, October 7, 2024
HomeUncategorizedరుణ‌మాఫీపై మాట నిల‌బెట్టుకున్నాం

రుణ‌మాఫీపై మాట నిల‌బెట్టుకున్నాం

Date:

తెలంగాణ రైతాంగానికి రుణ‌మాఫీపై ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నామ‌ని, కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తొలివిడతగా రూ.1 లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది. గతంలో రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేశారు. గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదు. రైతు డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నాం.

ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తాం. పాస్‌బుక్‌ ఆధారంగానే రుణమాఫీ ఉంటుంది. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్‌ కార్డు ప్రామాణికం. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవు. అందుకే పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నాం.

గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పులు చేసింది. దీనికి ప్రతి నెలా రూ.7వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం. జీతాలు, పింఛన్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వివిధ పథకాల కోసం రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించాం. మొత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. మూడు దశల్లో రుణాల మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో విడత రుణమాఫీకి రూ.8వేల కోట్లు అవసరమని అంచనా. రూ.లక్షన్నర నుంచి రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఆగస్టు 15లోపు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడో విడత రుణమాఫీకి రూ. 15వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.