సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ సరదాతో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. సెలవు రోజున స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువకుడు.. ప్రమాదకర స్టంట్ చేసి మృత్యువును కోరితెచ్చుకున్నాడు. పొంగిపొర్లుతున్న డ్యామ్ గోడపైకి ఎక్కి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు.
నాగ్‌పుర్‌లోకి కాలామ్న ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల ఆకాశ్ చకోలే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్నేహితులతో కలిసి స్థానిక పర్యటక ప్రాంతమైన మకర్‌ఢోక్డా డ్యామ్‌కు వెళ్లాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ డ్యామ్ నిండి అలుగుపారుతోంది. దీంతో టూరిస్టులను ఆకర్షిస్తోంది. దీన్ని చూసేందుకు వెళ్లిన ఆకాశ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రమాదకర స్టంట్‌కు యత్నించాడు.
ఈ ముగ్గురు నీరు పారుతున్న డ్యామ్ గోడను ఎక్కేందుకు ప్రయత్నించారు. వీరిలో ఆకాశ్ ఒక్కడే డ్యామ్ పైకి చేరగలిగాడు. మిగతా ఇద్దరు అతడిని కిందకు తీసుకొచ్చేందుకు చేయందించగా.. బ్యాలెన్స్ కోల్పోయి ప్రమాదవశాత్తూ అతడు డ్యామ్‌లో పడిపోయాడు. అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొన్ని గంటల తర్వాత అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.