Wednesday, September 25, 2024
HomeUncategorizedరికార్డు ధర పలుకుతున్న పసుపు

రికార్డు ధర పలుకుతున్న పసుపు

Date:

పసుపు రైతులకు చాలా రోజుల తర్వాత మంచి రోజులు వచ్చాయి. ఎన్నడూ లేనంతగా పసుపు రికార్డు స్థాయి ధర పలుకుతోంది. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ లో క్వింటా పసుపు రూ.20,120 పలికింది. నిజామాబాద్ జిల్లా అంక్సాపూర్ గ్రామానికి చెందిన రైతు తన పంటను సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్లగా రికార్డు ధర పలికింది. రైతుకు పసుపు పంటకు క్వింటాకు రూ.20,120 ధరను చెల్లించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపునకు భారీగానే ధర వస్తోంది. రెండు రోజుల క్రితం ఇక్కడి మార్కెట్లో క్వింటా పసుపురూ.18,299 పలికింది. పెర్కిట్‌కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు క్వింటాకు రూ.18,299 చెల్లించారు. మార్కెట్లో క్వింటా పసుపు కొమ్ములు కనిష్టంగా రూ. 8 వేలు పలుకుతున్నాయి. సగటున రూ. 14,250 పలుకుతున్నాయి. ధర లేకపోవడంతో రైతులు ఏటా పసుపు పంట సాగు తగ్గిస్తూ వస్తున్నారు.

దీంతో పసుపుకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ మార్కెట్లో 2011 తర్వాత ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 2011లో క్వింటా పసుపు ఆల్‌టైమ్‌ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత నుంచి ప్రతి ఏటా రూ.6-7 వేల మధ్యనే పసుపు ధరలు పలికుతూ వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ధరలు పెరిగాయి. రూ.15 వేల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో క్రమంగా ధరలు పుంజుకోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ గతేడాది అక్టోబర్ 4న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.