Sunday, September 29, 2024
HomeUncategorizedరాష్ట్రాన్ని చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు

రాష్ట్రాన్ని చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు

Date:

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాన్ని ఆ పార్టీ చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చారని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లోని బాలుర్‌ఘాట్‌లో నిర్వహించిన ప్రచార సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి టీఎంసీ మద్దతు ఇస్తుంది. కానీ, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ‘సీఏఏ’ను మాత్రం వ్యతిరేకిస్తోంది. స్థానికంగా అవినీతి, నేరాలు పెచ్చుమీరుతున్నాయి. వాస్తవాలు వెలికితీసేందుకు యత్నిస్తోన్న కేంద్ర సంస్థలపైనా దాడులు జరుగుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే టీఎంసీ ఈ రాష్ట్రాన్ని చొరబాటుదారులకు, గూండాలకు అప్పగించినట్లు కనిపిస్తోంది” అని ప్రధాని మోడీ ఆరోపించారు.

టీఎంసీని అవినీతి పార్టీగా పేర్కొంటున్న ప్రధాని మోడీ ముందుగా తాను అద్దంలో చూసుకోవాలని, బిజెపి మొత్తం బందిపోట్లతో నిండిపోయిందని మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ”అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు బిజెపి ప్రభుత్వం 300 కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపింది. కానీ, ఇంతవరకు ఏం కనుగొనలేదు. ఈ వ్యవహారంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉపాధి నిధులు ఏమయ్యాయో బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి” అని డిమాండ్‌ చేశారు. బిజెపిని ‘బెంగాల్‌ వ్యతిరేక పార్టీ’గా పేర్కొన్న దీదీ.. ‘ఎన్‌ఆర్‌సీ’ ముసుగులో గిరిజనులు, దళితులు, ఓబీసీలను ఇక్కడినుంచి తరిమికొట్టాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అనుమతించబోమని తేల్చి చెప్పారు. తన కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు భాజపా నేతలు ‘దొంగ దొంగ’ అని అరిచారని ఆమె ఆరోపించారు. ”నేను ఎంపీ పింఛన్‌ డ్రా చేయడం లేదు. జీతం కూడా తీసుకోను. సొంత కారులో ప్రయాణిస్తాను. సాధారణ వస్త్రాలే ధరిస్తాను. సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నాను. చాయ్‌ ఖర్చులూ నేనే చెల్లిస్తాను” అని తెలిపారు.