Wednesday, September 25, 2024
HomeUncategorizedరాష్ట్రపతికి జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ రిపోర్ట్

రాష్ట్రపతికి జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ రిపోర్ట్

Date:

దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అధ్య‌క్ష‌త‌న ఏర్పాటైన క‌మిటీ త‌న నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు గురువారం స‌మ‌ర్పించారు. ఈ నివేదిక‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ దేశ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్ధ‌కు ఇది చారిత్రాత్మ‌క దిన‌మ‌ని వ్యాఖ్యానించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక‌పై మోడీ ప్ర‌భుత్వం నియ‌మించిన ఉన్న‌త స్ధాయి క‌మిటీ త‌న నివేదిక‌ను రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించింద‌ని అమిత్ షా ఎక్స్ వేదిక‌గా రాసుకొచ్చారు. ఇక జ‌మిలీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్న‌త స్థాయి క‌మిటీ కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసింది. గురువారం ఆ రిపోర్టును రాష్ట్ర‌ప‌తి ముర్ముకు అంద‌జేశారు. ఆ నివేదిక‌లో పొందుప‌రిచిన అంశాల‌ను ప‌రిశీలిస్తే… మొద‌ట‌గా లోక్‌స‌భ‌, అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, ఆ త‌ర్వాత వంద రోజుల వ్య‌వ‌ధిలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ తెలిపింది.

తొలిసారి జ‌రిగే జ‌మిలీ ఎన్నిక‌ల‌కు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల ప‌రిమితి లోక్‌స‌భ ఎన్నిక‌ల తేదీ నాటికే ముగుస్తుంద‌ని రిపోర్టులో తెలిపారు. జ‌మిలీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని క‌మిటీ ఏకాభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు రిపోర్టులో తెలిపారు. 2029 నుంచే జ‌మిలీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని రిపోర్టులో కోరారు. 18626 పేజీల‌తో రిపోర్టును త‌యారు చేశారు. జ‌మిలీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం ముంద‌స్తు ప్లానింగ్ ఉండాల‌ని, ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన ఎక్విప్మెంట్స్‌, సిబ్బంది, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించాల్సి ఉంటుంద‌ని రిపోర్టులో పేర్కొన్నారు. సింగిల్ ఎన్నిక‌ల రోల్‌ను ఈసీ త‌యారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారుల‌తో క‌లిసి లోక్‌స‌భ, అసెంబ్లీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు చెందిన ఓట‌రు ఐడీ కార్డుల‌ను రూపొందించాల్సి ఉంటుంది.