Thursday, October 3, 2024
HomeUncategorizedరామోజీరావుతో మాట్లాడటం నా అదృష్టం

రామోజీరావుతో మాట్లాడటం నా అదృష్టం

Date:

తెలుగు ప్రజలందరినీ, తన అభిమానులందరినీ వదిలి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, రామోజీ ఫిలిం సిటీ సృష్టికర్త రామోజీరావు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఎంతో మందికి సాధ్యం కాని విజయాలను సాధ్యం చేసి చూపించిన గొప్ప ధీశాలి, పద్మ విభూషణ్ గ్రహీత, మహనీయుడు రామోజీరావు. రామోజీరావు మృతి పట్ల ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ రామోజీరావు మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేశారు. రామోజీ రావుగారి మరణం ఎంతో బాధాకరం. ఆయన భారతీయ మీడియాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఒక దార్శనికుడు అంటూ కితాబిచ్చారు. ఆయన సేవలు సినీ, పత్రికారంగాలలో చెరగని ముద్ర వేశాయని మోడీ అన్నారు.

ఆయనతో మాట్లాడటం నా అదృష్టం

తన అవిరళ కృషి ద్వారా, ఆయన మీడియా, వినోద ప్రపంచాలలో శ్రేష్టమైన ఆవిష్కరణలకు నూతన ప్రమాణాలను నెలకొల్పారు రామోజీరావు అంటూ మోడీ కొనియాడారు. రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా ఉత్సాహం చూపేవారని మోడీ అన్నారు. ఆయనతో సంభాషించడానికి, ఆయన అపారమైన జ్ఞానాన్నుంచి లబ్ధి పొందేందుకు అనేక అవకాశాలు పొందడం నా అదృష్టం అంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

రామోజీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోడీ

ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే తన జీవితంలో ఎన్నో అసాధ్యం అయిన అంశాలను సుసాధ్యం చేసిన రామోజీరావు ఆయన చివరి కోరికను మాత్రం తీర్చుకోకుండానే వెళ్ళిపోయారు. తన నిర్మాణ సంస్థ అయిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో 100 సినిమాలు తెరకెక్కించాలనేది ఆయన కోరిక. అయితే ఇప్పటికీ ఆ బ్యానర్లో సుమారు 90 సినిమాలు పూర్తయ్యాయి. మరో పది సినిమాలు చేస్తే ఆయన కోరిక తీరి ఉండేది. ఈలోపే రామోజీరావు తన తుది శ్వాస విడిచారు. 1978లో వచ్చిన మార్పు అనే సినిమాలో రామోజీరావు నటించడం గమనార్హం.