Saturday, September 21, 2024
HomeUncategorizedరాబోయే ఎన్నికల్లో అధికారం బీజేపీదే

రాబోయే ఎన్నికల్లో అధికారం బీజేపీదే

Date:

దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 370 సీట్లు గెలుచుకుంటుందని బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మే ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. అందుకే దేశ ప్రజలు భాజపాకు 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. దిల్లీలో గ్లోబల్‌ బిజినెస్ సమ్మిట్‌ 2024లో ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌, శిరోమణి అకాలీదళ్‌ వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అని ప్రశ్నించగా.. ‘మేం ఫ్యామిలీ ప్లానింగ్‌ను నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదు’ అని సమాధానమిచ్చారు. మరిన్ని పార్టీలు ఎన్డీయేలో చేరతాయని పరోక్షంగా వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురించి కూడా అమిత్‌ షా స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ.. ‘2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అంతటా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే.. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే ఈ పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం’ అని తెలిపారు. రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైందన్నారు.