Monday, October 7, 2024
HomeUncategorizedరాజ్య‌స‌భ‌లో త‌గ్గిన బిజెపి బ‌లం

రాజ్య‌స‌భ‌లో త‌గ్గిన బిజెపి బ‌లం

Date:

రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులైన రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్‌సింగ్, మహేష్ జెఠ్మలానీ పదవీకాలం శనివారంతో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 86కు తగ్గింది. అలాగే ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే బలం కూడా 101కు పడిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను ప్రస్తుతం 225 మంది సభ్యులున్నారు. ప్రస్తుతం మెజారిటీ మార్కు 113. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే బలం (101) మెజార్టీ మార్కు కంటే 12 తక్కువగా ఉంది. అయితే ప్రతిపక్షాలకు చెందిన ఇండియా కూటమి బలం 87గా ఉంది. కాంగ్రెస్‌కు 26, బెంగాల్‌లోని అధికార తృణమూల్‌కు 13, ఆప్‌కు 10 మంది, డీఎంకేకు పది మంది సభ్యులున్నారు.

మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీయేతర పార్టీలపై ప్రభుత్వం ఆధారపడాల్సి ఉంటుంది. ఒడిశాకు చెందిన బీజేడీకి 9 మంది సభ్యులున్నారు. అయితే బీజేడీ ప్రస్తుతం బీజేపీని వ్యతిరేకిస్తోంది. అలాగే నలుగురు సభ్యులున్న తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కూడా మద్దతు నిరాకరించే పరిస్థితిలో ఉంది. 11 మంది సభ్యులున్న ఏపీలోని వైఎస్‌ఆర్సీపీ, నలుగురు సభ్యులున్న తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి. అయితే బిల్లుల అంశంలో ఈ రెండు పార్టీలు, స్వతంత్ర ఎంపీలు ప్రభుత్వానికి మద్దతిచ్చే అవకాశముంది. అలాగే బీజేపీ నామినేట్‌ చేసిన 12 మంది సభ్యులు కూడా ప్రభుత్వానికి మద్దతిస్తారు. ఈ నేపథ్యంలో వీరి సహాయంతో బిల్లులను ప్రభుత్వం ఆమోదించే వీలుంది. రాజ్యసభలో ప్రస్తుతం 20 సీట్లు ఖాళీగా ఉన్నాయి.