Thursday, October 3, 2024
HomeUncategorizedరాజకీయాల కంటే నటిగా జీవించడమే ఆనందం

రాజకీయాల కంటే నటిగా జీవించడమే ఆనందం

Date:

రాజకీయాల్లో రాణించడం ఎంతో కష్టమని, దీంతో పోలిస్తే ఓ నటిగా హాయిగా జీవించవచ్చని ఎంపీగా గెలిచిన బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనా రనౌత్‌.. సినీ, రాజకీయ జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సవాళ్లతో కూడుకున్న రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలను కంగనా వివరించారు. ”మా ముత్తాత గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. చాలాకాలంగా రాజకీయాల్లో చేరాలని మా నాన్న, సోదరికి ఆఫర్లు వచ్చాయి. నా తొలి చిత్రం గ్యాంగ్‌స్టర్ తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎన్నోసార్లు సంప్రదించారు. కానీ, అందుకు సరైన సమయం రావాలని ఎదురుచూశా. నిజానికి రాజకీయాలతో పోలిస్తే.. నటులు అంతగా కష్టాలు లేని జీవితాన్ని గడుపుతారు. సెట్స్‌కి వెళ్లి రిలాక్స్‌ అవుతూ.. ఒత్తిడి లేని జీవితాన్ని గడుపుతాం. కానీ, ఎంతోమంది రకరకాల సమస్యలతో నాయకుల ముందుకు వస్తుంటారు. వాటిని జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది” అని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

”ఓసారి నా గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ జీవిత సూక్తులను బోధించారు. ‘తెలివైనవారు తమకు నచ్చిన పనిని మాత్రమే చేస్తారు. కానీ, అవసరమైన పనిని చేసినవారే మేధావులు అవుతారు’ అని అన్నారు. అందుకే గురూజీ చూపిన మార్గాన్ని ఎంచుకున్నా. రాజకీయాలపై ఆసక్తి లేకుంటే.. ఇన్ని కష్టాలను భరించాల్సిన అవసరం ఉండకపోయేది” అని కంగనా పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన కంగనా.. భాజపా తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. 74 వేలకు పైగా ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి విక్రమాదిత్యసింగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.