Sunday, October 6, 2024
HomeUncategorizedయువ‌కుడిని వెంటాడుతున్న పాము

యువ‌కుడిని వెంటాడుతున్న పాము

Date:

ఒక వ్య‌క్తికి త‌న జీవితకాలంలో ఎప్పుడో ఒక‌సారి పాము క‌నిపించ‌వ‌చ్చు. అనుకొని సంధ‌ర్బాల‌లో పాము కాటుకు గురయ్యేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు. కాని ఉత్తరప్రదేశ్‌ ఫతేపూర్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్‌ దూబే అనే వ్య‌క్తిని 40 రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గుర‌య్యారు. మొద‌ట‌గా జూన్‌ 2న రాత్రి ఇంట్లో వికాస్‌ను పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్నాడు. 10న మరోమారు అతడు పాముకాటు బారినపడ్డాడు. చికిత్స తీసుకున్నాక పాములంటే అతడికి భయం పుట్టింది. నిత్యం అప్రమత్తంగా ఉండేవాడు. అయినప్పటికీ అదే నెల 17న మళ్లీ అతడిని పాము కాటేసింది. ఈసారి అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మళ్లీ అదే దవాఖానలో చికిత్స పొందాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పాము కాటేసింది. మళ్లీ వచ్చిన దూబేను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. వైద్యులు, బంధువుల సలహా మేరకు దూబేను కుటుంబ సభ్యులు సొంత ఇంటికి దూరంగా ఫతేపూర్‌లోని రాధానగర్‌లో ఉంటున్న అతడి అత్తయ్య ఇంటికి తరలించారు. దురదృష్టం మరోమారు వెంటాడడంతో అక్కడ కూడా ఐదోసారి పాము కాటేసింది.

మళ్లీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం చేసేదేమీ లేక అతడిని తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత జులై 6న మరోమారు అతడిని పాము కాటేసింది. పరిస్థితి విషమించడంతో అతడి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరాడు. అయితే, పాము తనను శని, ఆదివారాల్లోనే కాటు వేస్తున్నట్లు.. కాటువేసే ముందు ప్రతిసారీ తనకు తెలిసిపోతుందని దూబే ఇదివరకే ఒక సందర్భంలో చెప్పాడు. తాజాగా గురువారం రాత్రి ఏడోసారి పాము కాటుకు గురైన దూబే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం క్షీణించినా ప్రస్తుతానికి నిలకడగానే ఉందని.. పరిస్థితి పూర్తిగా అంచనా వేసేందుకు 12 నుంచి 24 గంటలు పడుతుందని దూబేకి చికిత్స అందిస్తున్న వైద్యులు డాక్టర్‌ జవహర్‌ తెలిపారు.