తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డుపైకి తీసుకువచ్చిందని కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచామన్నారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజమన్నారు. కాంగ్రెస్‌కు బంగారు పళ్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు.
ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీకి బయటకు వెళ్లిపోతుందన్నారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ను భరించాలంటే తమ వల్ల కాదని నితీశ్‌కుమార్ అంటున్నారన్నారు. కూటమికి నితీశ్ కుమార్ కూడా బైబై చెప్పారని, బీజేపీని ఆపాలంటే ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ బొండిగ పిసికేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని.. బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలని బండి సంజయ్ అంటున్నాడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకా, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినందుకా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయ్యిందన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారన్నారు.
బిల్డప్ కోసం పథకాలు తెస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 51శాతంపైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధమని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కలువగానే రెండు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని ఆరోపించారు. కిషన్‌రెడ్డికి మరోసారి ఓటు అడిగే హక్కులేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోతే ప్రజలు బాధపడి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారని, కేంద్రమంత్రిగా ఒక్క పని చేయలేదన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి రూపాయి నిధులు కూడా కిషన్ రెడ్డి కేటాయించలేదని విమర్శించారు. కేంద్రమంత్రిగా ఉండి ఎందుకు దండగ అన్నారు. కాంగ్రెస్ అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మోడీ పాలనలో ధరల పెరుగుదల తప్ప మరేమీ లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒక్కటేనన్న కేటీఆర్. ఇద్దరూ కలిసి రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలకు కోపమొస్తుందని.. ఇందుకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సరైన సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని గెలిపించాల్సిన ఉందని కేటీఆర్ పిలుపునిచ్చారు.