మోడీ శిబిరంలోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే ఫైనాన్షియల్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ శిబిరంలోని కొందరు నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కూటమి మనుగడ కోసం కష్టపడుతోంది. అది బలహీనంగా ఉండటంతో ఏ చిన్న సమస్య అయినా ప్రభుత్వాన్ని కూలదోయొచ్చు’ అని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సారి ఇతరులపై ఆధారపడిన విషయం తెలిసిందే. 2014 తర్వాత తొలిసారి బీజేపీ మేజిక్ ఫిగర్ 272 సీట్లను దాటలేక పోయింది. ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 292 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదే సమయంలో ఇండియా కూటమి పార్టీలకు 230కి పైగా సీట్లు రావడం మోదీ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లైంది. ఇక చేసేదేమీ లేక కూటమి నేతల మద్దతుతోనే మోదీ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.