ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తనకు ఏలాంటి ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గల జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో రాహుల్ మాట్లాడుతూ.. ‘ఈ విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రధాని మోదీపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన అభిప్రాయాలు వేరు. దానికి నేను ఏకీభవించలేను. అంతేకానీ, నేను ఆయన్ని ద్వేషించట్లేదు. శత్రువుగానూ చూడట్లేదు. ప్రధాని చేసే పనుల పట్ల నాకు సానుకూలత ఉంది. అలాఅని, అవి మంచి ఫలితాలను ఇస్తాయని నేను అనుకోవట్లేదు. మా ఇద్దరి అభిప్రాయాలూ వేర్వేరు’ అని రాహుల్ చెప్పుకొచ్చారు.