నేను అవసరం ఉంటేనే ఫోన్ వాడతాను. మొబైల్ వినియోగాన్ని తగ్గించుకునేందుకు.. మీ ఫోన్లలో స్క్రీన్ టైం అలర్ట్ టూల్స్‌ను ఉపయోగించాలని ప్రధాని మోడీ అన్నారు. తాను ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తాను మొబైల్ ఫోన్ ఉపయోగిస్తానని, అతి ఎప్పుడూ మంచిది కాదని వ్యాఖ్యానించారు. కొన్ని వారాల్లో పరీక్షలు జరగనున్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టే నిమిత్తం నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో మోడీ ఈవిధంగా సలహా ఇచ్చారు
మొబైల్స్ చూస్తూ సమయాన్ని మర్చిపోకూడదు. మనం సమయాన్ని గౌరవించాలి. అలాగే పిల్లల ఫోన్ల పాస్వర్డ్లు కుటుంబసభ్యులు తప్పకుండా తెలుసుకోవాలి. టెక్నాలజీ నుంచి ఎప్పుడూ దూరంగా జరగకూడదు. కానీ దానిని సానుకూల ప్రభావం చూపేలా మాత్రమే వాడాలి’ అని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ‘పరీక్షలకు సన్నద్ధమవుతోన్న తరుణంలో పిల్లలు చిన్నచిన్న లక్ష్యాలు విధించుకొని, క్రమంగా పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. ఈరకంగా చదువుతూ వెళితే.. పరీక్షలకు పూర్తిగా సిద్ధం అవుతారు’ అని ప్రధాని తెలిపారు.
మనిషి శరీరానికీ రీఛార్జింగ్ అవసరం..
సరిగా పనిచేయాలంటే మొబైల్ ఫోన్ల లాగే మనిషి శరీరానికీ రీఛార్జింగ్ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యలో ప్రతిభచాటాలంటే శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పలు కీలక సూచనలు చేశారు. ”ఆరోగ్యకరమైన ఆలోచనల కోసం శారీరక ఆరోగ్యం చాలా చాలా అవసరం. ఇందుకోసం సూర్యకాంతిలో కొంత సమయం పాటు నిలబడటంతో పాటు రోజూ తగినంత నిద్రపోవాలి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే సరిపోదు.. రోజూ వ్యాయామం వంటి కార్యకలాపాలు ఫిట్‌నెస్‌కు అవసరం” అన్నారు. ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమానికి 2.26 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. దేశ రాజధానిలోని భారత మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొందరు పాల్గొనగా కోట్లాది మంది ఆన్లైన్లో వీక్షించారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదని ఈసందర్భంగా మోడీ సూచించారు. ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువని, అందువల్ల ఈ ప్రోగ్రామ్ తనకు సైతం పరీక్ష లాంటిదేనని అన్నారు.