Monday, September 23, 2024
HomeUncategorizedమొదలైన మేడారం జన జాతర...!

మొదలైన మేడారం జన జాతర…!

Date:

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జనంతో నిండిపోతుంది. మహాజాతరకు అంతా సిద్దమయింది. తెలంగాణ ములుగు జిల్లా మేడారంలో జరిగే మహాజాతరకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రాష్ట్రాల నుండి కోట్లాది భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. ఇప్పటికే మేడారంలో ఎటూ చూసిన జనమే కనపడుతున్నారు. భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని, బంగారాన్ని నివేదించుకుంటున్నారు. బుధవారం నాడు మేడారం మహాజాతర ప్రారంభం కానున్న క్రమంలో నేడు మేడారం రాజు, వనదేవరుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకువచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే సమ్మక్క కుమారుడు జంపన్నను సైతం పూజారులు మేడారం తీసుకు వెళుతున్నారు. దీంతో జాతర ప్రారంభం అవుతుంది. మేడారం గద్దెల పైకి వచ్చే దేవతలు, దేవరలు అందరినీ కాలినడకనే తీసుకురావటం విశేషం.

నేడు పూనుగొండ్లలో దేవుడు గుట్ట నుండి పగిడిద్దరాజును తీసుకువచ్చి దేవాలయంలో ప్రతిష్టించి శాంతి పూజా కార్యక్రమాలను చేసిన అనంతరం, పెన్క వంశీయులు పడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును పెళ్ళికొడుకు గా సిద్ధం చేసి ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగించి, ఆపై పూనుగొండ్ల అడవుల నుంచి మేడారానికి కాలినడకన తీసుకువెళ్తారు. పూజారి జగ్గారావుతో పాటు మరో పది మంది పూజారులు, భక్తులు పగిడిద్దరాజు వెంట మేడారం వెళతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్కపల్లి లక్ష్మీపురంలో పెన్క వంశీయుల వద్ద రాత్రికి పగిడిద్దరాజు విడిది చేస్తారు. ఆపై మళ్ళీ బుధవారం ఉదయాన్నే బయలుదేరి సారలమ్మ గద్దె చేరటానికి ముందే పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేరుస్తారు.

సమ్మక్క తనయుడు సారలమ్మ సోదరుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశస్తులు మేడారం తీసుకువస్తారు. పూజారి పోలెబోయిన సత్యమైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు మేడారానికి చేరుకుంటారు. ఆపై లక్షల మంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్టిస్తారు. పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకోవడంతో మేడారం జాతరలో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది.