మేడారం జాతరకు నడిచే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణమే కలిపించారు. జాతర సందర్భంగా ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి కూడా ఛార్జీలు వసూలు చేయాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రతిపాదనను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తిరస్కరించారు.
రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి భట్టి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. వచ్చే మేడారం జాతర సందర్భంగా తిరిగే ప్రత్యేక బస్సుల్లో మహిళల నుంచి టిక్కెట్లు తీసుకుంటే సంస్థ ఆదాయం పెరుగుతుందని ప్రతిపాదించారు. దీనిపై భట్టి స్పందిస్తూ.. ఇది సరికాదని, మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించాలని స్పష్టం చేశారు. మేడారం మాత్రమే కాకుండా ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టిక్కెట్లు తీసుకోవద్దని ఆదేశించారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగే మేడారం జాతరకు ప్రత్యేకంగా 6000 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులు నడుపుతున్నారు.