పశ్చిమ్‌బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పంపిన రెండో లేఖపై కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి తీవ్రంగా స్పందించారు. అత్యాచార ఘటనలకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినచట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని మమతా డిమాండ్ చేశారు. అలాగే నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని మరోసారి తన లేఖలో అభ్యర్థించారు. వారం రోజుల కిందట ప్రధానికి మమతా తొలిసారి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి సోషల్ మీడియా వేదికగా లేఖను విడుదల చేశారు. బెంగాల్‌లో ఫాస్ట్ కోర్టులు ఉన్నా.. వాటి పనితీరు సరిగ్గా లేవంటూ ఆక్షేపించారు.
”కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రాష్ట్రప్రభుత్వం సరిగా అమలుచేస్తే.. అటువంటి నేరాలకు పాల్పడినవారికి కఠినమైన శిక్షలు పడతాయి. బాధితులకు సత్వర న్యాయం చేకూర్చే అవకాశం ఉంది. చట్టాల ప్రకారం నిర్దేశిత సమయంలోగా తుది తీర్పు దక్కాలంటే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ బాధ్యతలు సక్రమంగా పాటించాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. బెంగాల్‌లో మాత్రం ఫాస్ట్ కోర్టుల పనితీరు బాగోలేదు. దాదాపు 48వేలకుపైగా అత్యాచార, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని త్వరగా పరిష్కరించాలంటే అదనంగా మరికొన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలి. ఇవేవీ చేయకుండానే కేంద్రంపై విమర్శలు చేయడం సరైందికాదు. ముందుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేయాలి” అని అన్నపూర్ణ దేవి పేర్కొన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.