దేశంలో నెలకొన్న తీవ్ర సంక్షోభం వల్ల మహిళలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని తమ మ్యానిఫెస్టోలో పేర్కొన్న గ్యారంటీలతో దేశంలో మహిళల స్థితిగతులు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో అన్నారు. అలాంటి వారందరికీ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకొని నేటి ఆధునిక భారత నిర్మాణం వరకు మహిళల కృషి మరువలేనిది. కానీ, ద్రవ్యోల్బణం వల్ల నేడు వారు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. వారి కష్టానికి న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ విప్లవాత్మక గ్యారంటీతో ముందుకొచ్చింది. మహాలక్ష్మి పథకంతో ప్రతి పేద మహిళకు సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తాయి” అని సోనియా గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే తాము అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని సోనియా పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి విప్లవాత్మక చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులకు కాంగ్రెస్ పార్టీ సాధికారత కల్పించిందన్నారు. మహాలక్ష్మి ద్వారా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
సోనియా గాంధీ వీడియో సందేశాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు పార్టీ నేతలు తమ ‘ఎక్స్’ ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఒక్క ఓటు విలువ సంవత్సరానికి రూ.లక్షతో సమానమని సోనియా సందేశాన్ని షేర్ చేస్తూ రాహుల్ గాంధీ అన్నారు.