Wednesday, September 25, 2024
HomeUncategorizedమహారాష్ట్రలో 40కి పైగా స్థానాలు గెలుస్తాం

మహారాష్ట్రలో 40కి పైగా స్థానాలు గెలుస్తాం

Date:

తమ కూటమి మహారాష్ట్రలో 40కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని సీట్ల సర్దుబాటు సందర్భంగా అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు. శివసేన, ఎన్సీపీ పార్టీల్లో చీలికలకు తాము కారణం కాదని బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. రైజింగ్ భారత్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీలను చీలుస్తున్నారని మాపై ఆరోపణలు చేసేవారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఉన్న ‘పుత్ర ప్రేమ్‌'(కుమారుడిపై ప్రేమ).. శివసేన రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమైంది. ఏక్‌నాథ్‌ శిందే అర్హతకు తగ్గట్టుగా బాధ్యతలు ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇక ఎన్సీపీ విషయానికి వస్తే.. శరద్‌ పవార్ ‘పుత్రి ప్రేమ్‌'(కూతురిపై ప్రేమ) దానిని చీల్చింది. అజిత్‌ పవార్‌కు సముచిత గౌరవం దక్కితే.. ఆయన బయటకు వచ్చేవారే కాదు’ అని అమిత్‌ షా విశ్లేషించారు.

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి శివసేన, ఎన్సీపీ (ఎంవీఏ) మహరాష్ట్రలో అధికారంలోకి వచ్చాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2022లో ఏక్‌నాథ్‌ శిందే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో బయటకు వెళ్లి, బిజెపితో చేతులు కలిపారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బిజెపి, శివసేన(శిందే వర్గం) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. గత ఏడాది అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి.. తన మద్దతుదారులతో కలిసి బిజెపి ప్రభుత్వంతో చేతులు కలిపారు.