Saturday, September 21, 2024
HomeUncategorizedమల్లికార్జున ఖర్గేపై ధన్‌ఖడ్‌ ఆగ్రహం

మల్లికార్జున ఖర్గేపై ధన్‌ఖడ్‌ ఆగ్రహం

Date:

భారత మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కి కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించిన విషయం తెలిసిందే. తన తాతను పురస్కారంతో గౌరవించిన కేంద్రానికి ఆయన మనవడు జయంత్‌ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతుండగా మధ్యలో ఖర్గే అడ్డుకున్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత జయంత్‌ చౌధరి రాజ్యసభలో మాట్లాడగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్రంగా మండిపడ్డారు.

భారతరత్నతో నాయకులను సత్కరించడంపై ప్రస్తుతం చర్చ జరగడం లేదు. సభలో సభ్యుడు ఒక అంశంపై మాట్లాడాలనుకుంటే.. దానికంటే ముందు మీరు (ఛైర్మన్‌ను ఉద్దేశిస్తూ) ఏ నియమం ప్రకారం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతారు. ఇప్పుడు జయంత్‌ మాట్లాడేందుకు ఏ నియమం ప్రకారం అనుమతి పొందారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాంటి అనుమతిని మాకు ఇవ్వండి. మేమూ వినియోగించుకుంటాం. రూల్స్‌ అనేవి న్యాయబద్ధంగా ఉండాలి. మీకు నచ్చినట్లు అమలుచేయడం కాదు అంటూ ఖర్గే అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలపై జగదీప్‌ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

మీరు చరణ్‌సింగ్‌ను అవమానించారు. ఆయన వారసత్వాన్ని కూడా అవహేళన చేశారు. ఆయన్ను అవమానిస్తే నేను సహించను. సభలో ఇలాంటి భాషను వినియోగించడం ఆమోదయోగ్యం కాదు. చరణ్‌సింగ్‌ కోసం మీవద్ద కాస్త సమయం కూడా లేదా. మీ ప్రవర్తనతో సభలో ఇటువంటి గందరగోళ వాతావరణాన్ని సృష్టించి దేశంలోని ప్రతీ రైతును బాధ పెడుతున్నారు. ఈ చర్యతో మనమంతా సిగ్గుతో తల దించుకోవాలి అని అన్నారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్‌ సహా వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లను ‘భారత రత్న’ వరించడం గర్వించదగ్గ విషయమంటూ ముగ్గురికీ సెల్యూట్‌ చేశారు.