Monday, September 23, 2024
HomeUncategorizedమరాఠా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం

మరాఠా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం

Date:

మహారాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ల బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం ఈమేరకు ప్రత్యేకంగా సమావేశమైంది. అంతకుముందు మంత్రివర్గం దీనికి ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా మరాఠా సామాజిక వర్గానికి స్థానికంగా విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ లభించనుంది. ఇది చట్టరూపం దాల్చి, అమలులోకి వచ్చిన పదేళ్ల తర్వాత మరోసారి సమీక్షిస్తారు. రాష్ట్ర జనాభాలో 28 శాతం మంది ఈ వర్గానికి చెందినవారు ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు.

జనవరి- ఫిబ్రవరి నెలల్లో ‘మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్’ విస్తృత సర్వే చేపట్టి.. దాదాపు 2.5 కోట్ల మరాఠా కుటుంబాలకు సంబంధించిన వివరాలు సేకరించింది. విద్య, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనంపై సమగ్ర నివేదికను ఇటీవల సమర్పించింది. 84 శాతం మరాఠా కుటుంబాలు వెనుకబడి ఉన్నట్లు అందులో తేలింది. రాష్ట్ర సగటు 17.4 శాతంతో పోలిస్తే.. ఈ వర్గంలో 21.22 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు వెల్లడైంది. దీంతో వారిని రిజర్వేషన్లకు అర్హులుగా పరిగణించినట్లు బిల్లులో పేర్కొన్నారు.

మాకు వద్దనుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. 10 శాతం లేదా 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా ఫర్వాలేదు. కానీ, ఓబీసీ కేటగిరీ కిందే ఇవ్వాలి. విడిగా కాదు” అని మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమకారుడు మనోజ్ జరాంగే స్పందించారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మరాఠా వర్గానికి చెందిన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల అవి హింసాత్మకంగా మారాయి.