కేంద్ర ప్రభుత్వం 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఐదుగురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు.
మరణాంతరం తమిళనాడుకు చెందిన స్టార్ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు కెప్టెన్ విజయకాంత్‌కు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికచేసారు. రాజకీయ, సామాజిక రంగాల్లో కెప్టెన్ సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కెప్టెన్ అభిమానుల్లో చాలామంది సంతోషపడుతున్నారు. అదే సమయంలో విజయ్ కాంత్ మన మధ్యలేకపోవడం విచారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ కాంత్‌కు పద్మభూషణ్ అవార్డు రావడంపై స్పందించిన ఆయన సతీమణి ప్రేమలతా విజయకాంత్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును విజయ్‌కాంత్‌ని ప్రేమించే ప్రతి ఒక్కరికీ, ఆయన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రేమలతా విజయకాంత్ వెల్లడించారు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కెప్టెన్ విజయ కాంత్ గతేడాది డిసెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతమైన ఆయన కరోనా బారిన పడడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.