Sunday, January 5, 2025
HomeUncategorizedమ‌న‌దేశంలో ప్ర‌తి ఏటా పాముల జాత‌ర..

మ‌న‌దేశంలో ప్ర‌తి ఏటా పాముల జాత‌ర..

Date:

సంప్ర‌దాయ, ఆచారాల‌ను బ‌ట్టి పండుగ‌లు, జాత‌ర‌లు నిర్వ‌హిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. దానికి అనుగుణంగానే ఉత్స‌వాలు జ‌రుపుతారు. పండుగల సమయంలో నిర్వహించే జాతరల గురించి మ‌నం వినే వింటాం. కానీ మ‌న దేశంలోని ఒక ప్రాంతంలో పాముల జాతర అట్ట‌హాసంగా జ‌రుగుతోంది. ఈ ప్రత్యేక పాముల జాతర బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో నిర్వహిస్తారు. సమస్తిపూర్‌లో ప్రతి సంవత్సరం నాగ పంచమి రోజున ఈ అద్భుతమైన పాముల జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటారు. ఈ జాతరలో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ పాముల జాతర గత మూడు వందల సంవత్సరాలుగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని సింఘియాలో నాగ పంచమి రోజున ఈ జాతర జరుగుతుంది. రాత్రంతా ప్రార్థనలు చేసిన తరువాత.. ప్రజలు ఊరేగింపుగా బయలుదేరి నదికి వెళతారు. స్నానం చేసి పాముకి పాలు, గుడ్డును భక్తితో సమర్పించుకుంటారు. ఇందులో వందలాది మంది భగత్‌లు (పాములను పట్టుకునే వ్యక్తులు) పాల్గొంటారు. బుధి గండక్ నదిలో స్నానం చేసి..ఆపై పాములను పట్టుకునే ఆట ప్రారంభమవుతుంది. గండక్ నదిలో స్నానం చేసి నీటిలో నుంచి పాములను చేతిలో పెట్టుకుని..నోటిలో కరచుకుని బయటకు తీస్తారు.

పాములు తన స్నేహితులంటూ మెడకు, చేతులకు చుట్టుకుంటారు. అక్కడి నుంచి ఊరేగింపుగా.. భగత్ రామ్ సింగ్ మాతా విశ్వ హరి ఆలయానికి వెళతారు. నది నుంచి డజన్ల కొద్దీ పాములను బయటకు తీసినట్లు చెబుతారు. వాటిలో చాలా విషసర్పాలు ఉన్నాయి. నదిలో నుంచి ఎవరు ఎన్ని పాములను త్వరగా బయటకు తీయాలన్న పోటీ నెలకొంది. ఈ రోజున ఇక్కడి ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు చెబుతారు. సిద్ధి పూర్తయిన తర్వాత నది నుంచి బయటకు తీసిన పాములను సురక్షిత ప్రదేశాల్లో వదిలేస్తామని పాములను తొలగించే భక్తులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద సమస్తిపూర్‌లో మాత్రమే పాముల జాతర నిర్వహించబడుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.