భోజనంలో ఊరగాయ వెయ్యలేదని హోటల్ యజమాన్యానికి వినియోగదారుల ఫోరం రూ. 35వేల జరిమానా విధించింది. పూర్తి వివరాల ప్రకారం
తమిళనాడు రాష్ట్రం విల్లుపురానికి చెందిన ఆరోగ్యస్వామి ఓ హోటల్‌లో 25 భోజనాలు ఆర్డర్ ఇచ్చాడు. ఆ భోజనాలను తీసుకెళ్ళి తింటుండగా ఊరగాయ కనిపించలేదు. భోజనం తినేవారిలో అత్యధిక శాతం మంది ఊరగాయ ఇష్టపడే వారు ఉన్నారు. దీంతో ఆరోగ్యస్వామి హోటల్ యజమానిని ఊరగాయ పచ్చడి వేయలేదని తెలియజేశాడు. అందుకు ఆ హోటల్ యజమాని ఆరోగ్యస్వామి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆరోగ్యస్వామి వినియోగదారుల ఫోరం కమిషన్‌ను ఆశ్రయించారు. దాదాపు రెండేళ్లుగా ఈ అంశంపై పోరాడారు. చివరకు ఈనెల 25న వినియోగదారుల ఫోరం కమిషన్ ఆ హోటల్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఊరగాయ వేయడం మరచిపోవడం…కస్టమర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు రూ.35 వేల జరిమానా విధించింది. అంతేకాదు ఆరోగ్యస్వామి ఖర్చుల నిమిత్తం రూ.5వేలు చెల్లించాలని ఆదేశించారు. అలాగే ఊరగాయల ప్యాకెట్లకు మెుత్తం రూ.25 చెల్లించాలని వినియోగదారుల ఫోరం కమిషన్ ఆదేశించింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.