భాగ్యనగరంలో ఆషాఢ మాసం బోనాల పండగ ఆదివారంనాడు వైభవంగా ప్రారంభమైంది. శివసత్తుల పూనకాలతో డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల హైదరాబాద్ నగరం మార్మోగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ నేడు ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజూము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు చేరుకున్నారు.
గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి తొలిపూజకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బంజారా దర్వాజ వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగిం గోల్కొండ కోటకు చేరుకుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పించారు.
భక్తితో మట్టి కుండలో పరమాన్నం వండి, బోనాలు సిద్ధం చేసి ఆలయానికి తరలివస్తున్నారు. డిల్లెం బల్లెం పాటల మోతలతో శివసత్తుల పూనకాలు, పోతరాజు ఆటల మధ్య బోనాలు ఆలయానికి తరలివస్తుంటే గొల్కొండ కోటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దశాబ్ది బోనాల పేరుతో పండగను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులతో ఉత్సవాలు నిర్వహిస్తోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.