Thursday, October 3, 2024
HomeUncategorizedబెంగళూరులో ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం

బెంగళూరులో ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం

Date:

కర్ణాటక రాజధాని బెంగళూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్‌లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. జూన్‌లో ఆదివారం ఒక్క రోజు కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. బెంగళూరులో ఆదివారం 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. ఇది జూన్ నెలలో కురవాల్సిన సగటు కంటే ఎక్కువ అని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంతకుముందు బెంగళూరులో 1891 జూన్ 16న 101.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా.. జూన్ 3 నుండి 5 వరకు ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు బెంగళూరులో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో.. ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పర్పుల్ మార్గంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీళ్లు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు నగరంలో అత్యధికంగా హంపి నగర్‌లో 110.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. తర్వాత మారుతి మందిర వార్డు (89.50 mm), విద్యాపీఠ్ (88.50 mm), కాటన్‌పెట్ (87.50 mm)లో వర్షం కురిసింది.