Wednesday, September 25, 2024
HomeUncategorizedబెంగళూరులో ఎండిపోయిన బావులు, బోర్లు

బెంగళూరులో ఎండిపోయిన బావులు, బోర్లు

Date:

కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక బెంగళూరు ప్రజలు అల్లాడిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులైతే గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకక బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు విపరీతమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లభించక విలవిలలాడుతున్నారు. గత రెండు నెలలగా అవస్థలు పడుతున్న జనాలు.. ఇప్పుడు ఆ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవాలంటూ దేవునికి మొక్కుతున్నారు. బెంగళూరులో నీటి సంక్షోభం మరింత ముదిరింది.

బెంగళూరులో నీటి బావులు, బోర్లు, కాలువలు అన్ని ఎండిపోయాయి. దీంతో చుక్క నీరు కోసం కష్టపడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిన కొన్ని నీళ్లతోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ చేసుకుని వాడుకుంటున్నారు. నీటి ట్యాంకర్లు కూడా సరిగ్గా దొరకడం లేదు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు ట్యాంకర్లు అవసరం ఉన్న చోట కేవలం ఒక ట్యాంకరే వస్తోంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక వాసి వాపోయాడు. పైగా ట్యాంకర్లు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రుతుపవనాలు త్వరగా వస్తే మంచి రోజులు వస్తాయని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని ప్రజలు మండిపడుతున్నారు. తాగునీటి కోసం కిలోమీటరు పొడవునా క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని.. గత నెల రోజుల్లో 5 సార్లు మాత్రమే స్నానం చేసినట్లు ప్రజలు వాపోయారు.

బెంగళూరు ప్రధానంగా కావేరి నది.. భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే మురుగునీటిని శుద్ధి కర్మాగారాల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తారు. కానీ గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో నీటి లభ్యత తగ్గిపోయింది. ఇలా రెండు నెలలుగా అవస్థలు పడుతున్నారు. బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం సగం కూడా దొరకడం లేదు. దీంతో నగరవాసులు రోజు నీళ్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక నివాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు అక్రమార్జనకు తెరలేపాయి. ట్యాంకర్లకు అధికారులు ధరలను నిర్ణయించారు. అయినా కూడా ఎక్కడా అమలు కావడం లేదు. ఇక వాహనాలను శుభ్రపరచడానికి.. వ్యవసాయం, నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని ప్రకటించారు. ఇక ఆస్పత్రుల్లో అయితే పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయి.